ఏ సెపరేషన్ ఇరానీ సినిమా.. కుటుంబ కథని,ఇరానీ మధ్య తరగతి జీవితాన్ని వెండితెర మీద చాలా అందంగా చిత్రీకరించాడు దర్శకుడు. భార్యభర్తలు విడిపోవడానికి చిన్ని చిన్ని కారణాలు సరిపోతయేమో అనిపిస్తుంది మొదటి సీన్లోనే.. కూతురు భవిష్యత్ కోసం విదేశాలకి వెళ్దామని భార్య పట్టుపడుతుంది, విదేశాలకు వెళ్తే అల్జీమర్ వ్యాధితో బాధపడుతున్న తండ్రిని చూసుకోవడం కష్టమవుతుంది అందుకు విదేశాలకు వెళ్లడానికి నిరాకరిస్తాడు భర్త..అక్కడ విభేదాలు వచ్చి విడాకుల తీసుకునే వరకు వెళ్తుంది.
కోర్టు కాస్త సమయం తీసుకోవాలని ఇద్దరికీ చెబుతోంది. దాంతో అప్పటికే విసిగెత్తిన భార్య తన భర్తని కూతురిని వదిలేసి తన పుట్టింటికి వెళ్తుంది. సహయం కోసం పనిమనిషిని నియమించి వెళుతుంది. ఇంట్లో హీరో తండ్రిని చూసుకోవడం చాలా కష్టమైపోతుంది. ఒక రోజు హీరో మధ్యాహ్నం ఇంటికొచ్చే సరికి పనిమనిషి కనబడదు. తండ్రి చేతులు కట్టేసి ఉంటాయి. కింద అపస్మారక స్థితిలో పడిపోయి ఉంటాడు, ఇంట్లో డబ్బులు కూడా కనిపించవు దీంతో చిర్రెత్తుకొచ్చి అప్పుడే వచ్చిన పనిమనిషిని ఇంట్లోంచి బయటకు తోస్తాడు. కింద పడిన పనమనిషి తన కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుంది. పనిమనిషి భర్త కోర్టులో కేసేస్తాడు ఆ తరవాత రెండు కుటుంబాల మధ్య ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంంటాయి. భార్య భర్తల బంధం ఎటు దారితీస్తుంది?. అమ్మ నాన్నల మధ్య ఈ గొడవలు జరుగుతున్న పరిణామాల వల్ల కూతురు ఎలా నలిగిపోతుంది అన్నది చూసి తీరాల్సిందే.
ఒక కుటుంబ కథని ఇంత గ్రిప్పింగా తీయడం ఆకట్టుకుంటుంది. సినిమా విషయానికి వస్తే అనేక అవార్డులు మొత్తం 43. 2012 ఆస్కార్ ఉత్తమ విదేశీ చిత్రంగా కూడా నిలిచింది. సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఉంది.